కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు: ఒకేరోజు 13.59 లక్షల వ్యాక్సిన్లు

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు: ఒకేరోజు 13.59 లక్షల వ్యాక్సిన్లు – Andhra Sets Record With Over 1.3 Million People Vaccinated In A Single Day

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తన రికార్డును తానే అధిగమించింది. గతంలో ఒకేరోజు 6.32 లక్షల డోసులు టీకాలు వేసి దేశంలోనే రికార్డు సృష్టించగా ఆదివారం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ అంచనాలకు అందని రీతిలో విజయవంతమైంది. తాజాగా ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేశారు. దీంతో ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో టీకాలు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్‌ తన రికార్డును తానే అధిగమించింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన టీకాల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకూ కొనసాగింది. వార్డు/గ్రామ సచివాలయాలు మొదలుకొని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల వరకూ సీవీసీ (కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌)లు ఏర్పాటు చేసి భారీగా టీకాలు వేశారు.

andhra-pradesh-record-in-covid-vaccination-in-a-single-day

రాష్ట్రంలో ఈనెల 19వతేదీ సాయంత్రానికి 1,23,16,609 డోసులు వేశారు. ఆదివారం ఇచ్చిన 13,59,300 డోసులు దీనికి అదనం. దీంతో ఇప్పటిదాకా 1,36,75,909 డోసులు ఇచ్చినట్లైంది.  అన్ని జిల్లాల్లోనూ ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు పెద్ద సంఖ్యలో టీకాలు తీసుకున్నారు. విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న వారు కూడా టీకాలు పొందారు. అత్యధికంగా  పశ్చిమ గోదావరి జిల్లాలో 1.64 లక్షల మందికి పైగా టీకాలు ఇవ్వగా అత్యల్పంగా 63 వేల మందికి విజయనగరం జిల్లాలో టీకాలు ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 4,589 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. భారీ స్థాయిలో సిబ్బంది ఇందులో భాగస్వాములయ్యారు. ఆరోగ్యశాఖకు చెందిన 28,917 మంది సిబ్బందితోపాటు 40 వేల మంది ఆశా కార్యకర్తలు రాత్రి వరకు విధులు నిర్వహించారు. ఇతర విభాగాలకు చెందిన మరో 5 వేల మంది సిబ్బంది టీకా ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేసినట్లు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ తెలిపారు. వ్యాక్సిన్ల వినియోగంలో ఎక్కడా వృథా జరగలేదని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రానికి మరో 2 లక్షల డోసులు రానున్నట్లు వెల్లడించారు.

Leave a Comment